చైనాకు మరో షాక్: మరో సంచలన నిర్ణయం తీసుకోనున్న భారత్
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితికి కారణమైన చైనాపై సాధారణ ప్రజలతోపాటు భారత ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం ఉంది. డ్రాగన్ దేశానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలోనే చైనా ఆర్థిక వ్యవహారాలను దెబ్బ తీసేలా భారత్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే చైనా వస్తువులు.. ఉత్పత్తులు.. సేవలు బహిష్కరించాలని ఉద్యమం వస్తోంది. దీనిలో భాగంగా తాజాగా 59 చైనా యాప్ లపై నిషేధం విధించి షాకిచ్చిన భారత్ ఇప్పుడు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. కీలక దిగుమతులను అడ్డుకునే దిశగా భారత్ సమాలోచనలు చేస్తోంది. అదే జరిగితే మాత్రం చైనాకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఆ దేశ ఉత్పత్తి సంస్ధలు భారీగా నష్టపోనున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే అత్యున్నత స్ధాయిలో కేంద్ర ప్రభుత్వం చర్చలు చేస్తోంది.
గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి తర్వాత చైనాపై భారత వైఖరి పూర్తిగా మారిపోయింది. కీలకమైన చైనా ఉత్పత్తులను ఒక్కొక్కటిగా నిషేధిస్తూ రావాలని భావిస్తున్న కేంద్రం... తొలి విడతగా 59 పాపులర్ మొబైల్ యాప్ లను నిషేధించింది. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయినా భారత్ వెనకడుగు వేయడం లేదు. తదుపరి చర్యపై కేంద్రం దృష్టి సారించింది.





